పవన్ కళ్యాణ్ తాజా చిత్రం ‘గబ్బర్‌సింగ్’లో ఓ ఢిఫెరెంట్ క్యారెక్టర్ లో కనిపించి అలరించనున్నాడు. ఆ క్యారక్టైజేషన్ గురించి యూనిట్ వర్గాలు చెప్తూ...చేసే పోలీస్ ఉద్యోగాన్ని తేలిగ్గా తీసుకుంటాడు. ఎదురున్న శత్రువుని కూడా తేలిగ్గానే తీసుకుంటాడు. లంచగొండి తనాన్నీ తేలిగ్గానే తీసుకుంటాడు. కావాలనుకుంటే తను కూడా లంచం తీసుకుంటాడు. కొట్టాలనిపిస్తే ఎవర్నయినా కొట్టేస్తాడు. మూడ్ లేకపోతే... ఎవర్నయినా వదిలేస్తాడు. కానీ అమ్మ, నాన్న, తమ్ముడు... ఇలాంటి సెంటిమెంట్లను మాత్రం చాలా సీరియస్‌గా తీసుకుంటాడు. ఇలాంటి డిఫరెంట్ కేరక్టరైజేషన్ పవన్ ఇంతకు ముందు చేయలేదు. హిందీలో సల్మాన్ ఖాన్ అబిమానులను ఆకట్టుకున్నది ఇది. ఇప్పుడు పవన్ ఫ్యాన్స్ కి కిక్కు ఇచ్చేది ఇదే. ఇక ‘మిరపకాయ్’ ఫేం హరీష్‌శంకర్ దర్శకత్వంలో గణేష్‌బాబు నిర్మిస్తున్న ఈ చిత్రంలోని పవన్‌కళ్యాణ్ ‘ఫస్ట్ లుక్’ని మంగళవారం దర్శక, నిర్మాతలు పత్రికలవారికి విడుదల చేశారు.
ఈ సందర్భంగా నిర్మాత మాట్లాడుతూ -‘‘‘పవర్ స్టార్’ పవన్ కళ్యాణ్‌ని ఎలా చూడాలని అభిమానులు కోరుకుంటున్నారో... ఈ చిత్రంలో ఆయన అలా కనిపిస్తారు. ‘గబ్బర్‌సింగ్’గా పవన్ అభినయం ఇందులో కొత్త పుంతలు తొక్కుతుంది. పవర్‌స్టార్ మార్క్ కామెడీకి కూడా ఈ సినిమాలో లోటు ఉండదు. ఇక శ్రుతిహాసన్ గ్లామర్ ప్రత్యేక ఆకర్షణ అని చెప్పాలి. హరీష్‌శంకర్ ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకొని ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఆయన్ను దర్శకుడిగా ఉన్నతస్థాయికి తీసుకెళ్లే సినిమా ఇది. ఏప్రిల్‌లో సినిమాను విడుదల చేస్తాం’’ అని చెప్పారు. నాగబాబు, సుహాసిని, బ్రహ్మానందం, తనికెళ్ల భరణి, అజయ్, అభిమన్యు సింగ్ తదితరులు ఇతర పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: దేవిశ్రీప్రసాద్, నిర్మాణం: పరమేశ్వర ఆర్ట్ ప్రొడక్షన్స్.