బాబు, జగన్ కుమ్మక్కు, చిరు మిస్టర్ క్లీన్: కన్నబాబు

హైదరాబాద్: తెలుగుదేశం పార్టీ, వైయస్సార్ కాంగ్రెసు పార్టీ తీరుపై ప్రజారాజ్యం పార్టీ శాసనసభ్యుడు కన్నబాబు సోమవారం అసెంబ్లీలో ధ్వజమెత్తారు. టిడిపి అధినేత నారా చంద్రబాబు నాయుడు అక్రమాలకు పాల్పడ్డారని కోర్టుకు వెళ్లి సిబిఐ విచారణ జరిపిస్తున్న వైయస్సార్ కాంగ్రెసు పార్టీయే ఇప్పుడు మళ్లీ బాబుకు మద్దతివ్వడం ఏమిటని ప్రశ్నించారు. అవిశ్వాసం పెట్టే హక్కు ప్రతిపక్షాలకు ఉందని కానీ దానిపై స్పష్టత ఉండాలని సూచించారు. చంద్రబాబు రైతు సమస్యలపై ఓ జీవిత కాలం ఆలస్యంగా మేల్కొన్నారన్నారు. ప్రజల విశ్వాసం కోల్పోయిన టిడిపి అవిశ్వాసం పెట్టడం అనైతికమన్నారు. కాంగ్రెసు ఇప్పటి వరకు ఒక్కసారి అవిశ్వాసం పెట్టలేదన్నారు. దివంగత వైయస్ రాజశేఖర రెడ్డి పథకాలు అన్నీ కిరణ్ హయాంలో కొనసాగుతున్నాయన్నారు. కిరణ్ ప్రభుత్వంలో స్కీములే తప్ప స్కాములు లేవన్నారు.

బయట బాబుపై కేసులు పెట్టి సభలో మద్దతివ్వడంపై వైయస్సార్ కాంగ్రెసు పార్టీ ప్రజలకు వివరణ ఇవ్వాలన్నారు. అది నైతికత ఎలా అవుతుందని ప్రశ్నించారు. బాబు తీర్మానానికి మద్దతివ్వడమంటే ఆయన అవినీతికి మద్దతిస్తున్నారా? లేక రాజకీయ దురుద్దేశ్యంతో మాత్రమే ఆయనపై వైయస్ విజయమ్మ కేసు పెట్టారా? చెప్పాలన్నారు. వైయస్‌పై టిడిపి విమర్శలు చేస్తుంటే వైయస్ అభిమానులమని చెప్పుకునే ఎమ్మెల్యేలు ఒక్కరు నోరు మెదపలేదని అదే సిఎం, మంత్రులు విరుచుకు పడ్డారన్నారు. ప్రజాస్వామ్యయుతంగా ఎన్నికైన ప్రభుత్వాన్ని కూలగొట్టాలనుకోవడం అప్రజాస్వామికమనే మా నాయకుడు ప్రభుత్వాన్ని ఆదుకుంటున్నారన్నారు. ప్రజారాజ్యం పార్టీ తరఫున అవిశ్వాసం వ్యతిరేకిస్తున్నామని మిగిలిన పార్టీలు కూడా దీనిపై ఆలోచించి ప్రభుత్వానికి నిర్మాణాత్మక సలహాలు ఇవ్వాలని కోరారు.

మీరు పడగొడితే మేం నిలబెడతామని ఆయన చెబుతున్నారన్నారు. ప్రజల తీర్పును గౌరవించాల్సిన బాధ్యత ప్రతి ఒక్క సభ్యుడిపై ఉందన్నారు. రాష్ట్ర అభివృద్ధిలో చంద్రబాబు పాత్ర ఉందని అదే సమయంలో ఆయన రైతులను విస్మరించారన్నారు. రైతుపోరు బాట పేరుతో బాబు ప్రజల్లోకి వెళ్లడం ప్రశంసించదగ్గదే అని అయినంత మాత్రాన అవిశ్వాసం పెట్టడం సరికాదన్నారు. ఇది ప్రజాస్వామ్యానికి గొడ్డలి పెట్టు అన్నారు. టిడిపి, వైయస్సార్ కాంగ్రెసు పార్టీ కుమ్మక్కైనందు వల్లే జగన్ బాబుకు మద్దతిస్తున్నారని ఆయన అభిప్రాయపడ్డారు. ఈ రాష్ట్రంలో క్లీన్ చిట్ ఉన్న నాయకుడు ఎవరైనా ఉన్నారా అంటే అది చిరంజీవి మాత్రమే అన్నారు. టిడిపి, వైయస్సార్ కాంగ్రెసు తదితర పార్టీలు బయట కేసులు వేసుకొని సభలో మద్దతిచ్చుకుంటున్నాయని దీనిని ప్రజలు గమనిస్తున్నారన్నారు.

తెలంగాణ, సమైక్యాంధ్ర ఉద్యమాలు ఓ వైపు, అధికారం నాదేనని ఒక పార్టీ అధినేత మరోవైపు అంటున్న ప్రస్తుత సంక్లిష్ట పరిస్థితుల్లో కిరణ్ ప్రభుత్వం సంక్షేమ పథకాలకు వెనుకడుగు వేయడం లేదన్నారు. అవినీతి టిడిపి నేర్పిన విద్యే అన్నారు. జలయజ్ఞం, గనుల కేటాయింపులో అక్రమాలు జరిగిన మాట వాస్తవమే అన్నారు. తప్పు ఎవరు చేసిన తప్పేనన్నారు. అయితే అధికారంలో ఉన్నప్పుడు ఓ మాట అధికారంలో లేనప్పుడు మరో రకంగా మాట్లాడవద్దన్నారు. కాగా కన్నబాబు మాట్లాడుతుండగా టిడిపి సభ్యులు నిరసన వ్యక్తం చేశారు. దానికి ఆయన మీరు నన్ను రెచ్చగొట్టవద్దని, మీరు అల్లరి చేస్తే నేను ఇంకా ఎక్కువ మాట్లాడతానని చురకలు వేశారు. మేం అభివృద్ధికి ప్యాకేజీలు కావాలని అడుగుతున్నామని కాని టిడిపి వాళ్లకు మాత్రం వైస్రాయ్ ప్యాకేజీలు కావాలా అని ప్రశ్నించారు. కాగా సభలో ఓ పిట్టకథ చెప్పి అలరించారు.

MR.BEAN